ఇన్ఫోసిస్‌ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు
Bussiness

ఇన్ఫోసిస్‌ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు

టెక్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బ్లోయర్‌ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై మరో విజిల్‌ బ్లోయర్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్‌ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఒక లేఖ రాశారు. సీఈవో పరేఖ్‌ కంపెనీలో చేరి ఒక సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ,  ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు.

11 బిలియన్ డాలర్ల కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్‌బ్లోయర్, పరేఖ్‌ అక్రమాలను బహిర్గతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నానంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను ఛైర్మన్, బోర్డు దృష్టికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని  చెప్పారు. తక్షణమే స్పందించి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *